పేద వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్పెషల్ ఫోకస్

పేద వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం

  • 2నెలల్లో సంతపేట మార్కెట్ పూర్తి
  • నిర్వాసితులకు10 వేల వంతున నష్టపరిహారం
  • నగర మేయర్ అబ్దుల్ అజీజ్

(ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్)

నగరంలోని పురాతన సంతపేట మార్కెట్టును ఆధునీకరించి పేద వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని, అందులో భాగంగా నిర్మిస్తున్న రెండు అంతస్తుల వాణిజ్య సముదాయాన్ని అరవై రోజుల్లో పూర్తి చేసి, దుకాణాల యజమానులకు అందిస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. స్థానిక మార్కెట్టును ఆయన సోమవారం సందర్శించి దుకాణదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ సమయంలో దుకాణాలను తొలగిస్తున్నందున వ్యాపారులకు కలిగే నష్టాన్ని అంచనావేసి ప్రతీ దుకాణానికి పదివేల రూపాయల వంతున పరిహారం అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వ్యాపారం కొనసాగించేందుకు స్థానిక రైల్వేఫీడర్ రోడ్డులో తాత్కాలిక ఏర్పాట్లతో దుకాణాలను నిర్మించి ఇస్తామని మేయర్ పేర్కొన్నారు. రూ.9 కోట్లతో నిర్మిస్తున్న వాణిజ్య సముదాయంలో అంతస్తుకు 150 దుకాణాల వంతున కేటాయించి, ప్రస్తుతమున్న దుకాణదారులకే ప్రాధాన్యం కల్పిస్తామని మేయర్ స్పష్టం చేసారు. వ్యాపారుల సౌలభ్యం కోసం అధునాతన షేర్ వాల్ టెక్నాలజీ విధానంతో అత్యంత వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తిచేసి దుకాణాలను ప్రణాళిక బద్దంగా కేటాయిస్తామని మేయర్ స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చిరు వ్యాపారుల ఆర్ధిక అభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాలను అభివృద్ధి పధంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణా రెడ్డి, కార్పొరేటర్ ప్రశాంత్ కుమార్, నాయకులు నన్నేసాహెబ్, షంషుద్దీన్, యష్రబ్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *