నవ్యాంధ్ర దిశా నిర్దేశకులు ముఖ్యమంత్రి చంద్రబాబే…

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్పెషల్ ఫోకస్

నవ్యాంధ్ర దిశా నిర్దేశకులు ముఖ్యమంత్రి చంద్రబాబే…

-52 డివిజన్ జన్మభూమి సభలో మేయర్

(ఏపీ న్యూస్ టుడే స్టాఫ్ రిపోర్టర్):

బహుళార్థసాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రపంచ రికార్డులు సాధిస్తూ, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబే నవ్యాంధ్రకు దిశా నిర్దేశకులని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబు అహర్నిశలూ శ్రమిస్తూ, అభివృద్ధి నిరోధకులుగా మారిన కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిలతో ఏకకాలంలో పోరాడుతున్నారని ఆయన తెలిపారు. ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక 52వ డివిజన్ రంగనాయకుల పేటలో గురువారం ఏర్పాటు చేసిన సభకు మేయర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ప్రజలందరికీ మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, టిడిపి, వైసిపి, సిపిఎం అన్న బేధాలు లేకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టామని మేయర్ స్పష్టం చేసారు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వంతో పోరాడి సాధించేందుకు అవకాశమిచ్చిన అసెంబ్లీ వేదికను వదిలేసి, వైసిపీ ఎమ్మెల్యేలు దండాలు పెట్టుకుంటూ రోడ్లపై తిరుగుతున్నారని, కార్పొరేటరు పాటి అభివృద్ధిని సైతం సాధించలేనివారిగా చరిత్రకెక్కుతారని మేయర్ విమర్శించారు. ప్రజల అవసరాలను గుర్తించి గత ప్రభుత్వాలకన్నా మెరుగైన సంక్షేమ పధకాలను చంద్రబాబు ప్రవేశపెట్టడంతో పాటు అత్యంత పారదర్శకంగా అమలుచేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా కార్పొరేషను పరిధిలోని అన్ని డివిజనుల్లోని ప్రధాన మార్గాల్లో తారు రోడ్లు, వీధుల్లో సిమెంటు రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణాలను చేపట్టామని, నిర్మాణ పనులన్నీ అత్యంత త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామని మేయర్ స్పష్టం చేసారు.

                   ఒకే కుటుంబంలోని అర్హులైన అందరికీ పెన్షను అందించేలా ముఖ్యమంత్రి చేస్తున్న ఆలోచన అత్యంత హర్షణీయం అని మేయర్ కొనియాడారు. పేదవాడి స్వంత ఇంటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన 'ఎన్టీఆర్ హౌసింగ్ ఫర్ ఆల్' పధకం ప్రజల జీవితాల్లో ఉన్నతమైన మార్పు తీసుకొస్తుందని స్పష్టం చేసారు. రేషన్ కార్డు ఇంకా పొందని పేదవారు సైతం ఎన్టీఆర్ గృహాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా పధకంలో సవరణలు చేసి, ఓటర్ గుర్తింపును ప్రామాణికంగా తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. సంక్షేమ పధకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ శిబిరంలో దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా ఇతర సామాజిక సమస్యలను సైతం ఆయా డివిజనుల్లో జరిగే జన్మభూమి సభల్లో విజ్ఞప్తుల రూపంలో అందజేస్తే, సత్వరమే సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం స్పందిస్తుందని మేయర్ వెల్లడించారు. అనంతరం శిబిరంలో నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మేయర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు నిర్వహించిన సామూహిక సీమంతాల్లో మేయర్ పాల్గొని, ఆరోగ్యవంతమైన సంతానానికై పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షంషుద్దీన్, ఖుద్దుస్ బాబు, జాకీర్, యసరబ్, వెంగయ్య యాదవ్, పిగిలం సుధీర్, పాషా మోహిద్దీన్, సయ్యద్ ఇక్బాల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

29వ డివిజనులో కార్పొరేటర్ దొడ్డపనేని రాజనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నాయకులు కొండ్రేడ్డి రంగారెడ్డి, ఆనం జయ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి మేయర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *